Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday, 28 October 2016

Attractions of Amsterdam(ఆమ్స్టర్డామ్, నెథర్లాండ్స్)

కొత్త కొత్తగా ఉన్నదీ స్వర్గమిక్కడే అన్నది, కోటితరాలే.పులయేరులై.. నేలచేరగానే... ఏమిటా నెథర్లాండ్ గురించి చెప్పుకుండా కూలి నo.1 పాట పడుతున్నారు అనుకోకండి, అక్కడికే  వస్తున్నాము, ఆ పాటలో మనకు కనిపించే పూల తోటలు చూసి, మనం కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి అని అనుకోని వారు ఉండరు కదా. అలా అనుకున్న వారిలో మేము ఉన్నాము .ఈ  వేసవి కాలం విహారయాత్రలో భాగంగా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ యాత్ర యొక్క విశేషాలు మీకోసం. ఆమ్స్టర్డామ్ నెథర్లాండ్స్


మొదటగా మేము నెథర్లాండ్స్ రాజధాని అయిన అమ్స్టర్డామ్ (Amsterdam)ను సందర్శించాము. ఇది ఒక మెట్రోపాలిటన్ నగరం. నెథర్లాండ్ దేశ ఆదాయములో అధిక మొత్తం ఈ నగరము నుండే వస్తుంది. నగరం అంతా  చిన్న చిన్న కాలువలు మరియు డచ్  భవనాలతో ఎంతో అందముగా ఉంది. కాలుష్యం తగ్గించే ఉద్దేశంతో ఈ దేశ ప్రజలు పడవలు మరియు సైకిల్లని వారి రవాణా మార్గంగా ఎంచుకున్నారు.

డచ్ శైలి భవనములు 

ఈ నగరం సముద్రమట్టానికి దివగా ఉండటం వలన, వరదలు వచ్చినప్పుడు మునిగిపోతూ ఉండేదంట, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుని నీటి మట్టాన్ని సరిచేసేందుకు నగరమంతా కాలువలు మరియు మురుగు నీటి వ్యవస్థ పటిష్ట పరిచి ,ఈ నగరాన్ని పునర్నిర్మించింది. టూరిస్టులు కోసం బస్సులు ,పడవలు మరియు  సైకిల్స్ ఉంటాయి, మీ సౌకర్యాన్ని బట్టి, మీ ప్రయాణ మార్గాన్ని ఎంచుకోవచ్చు. మేము బస్సు మరియు పడవ ప్రయాణం ఎంచుకున్నాము. పడవ నడిపే అతను ముఖ్యమైన ప్రదేశములు వచ్చినప్పుడు, మాకు మైక్ సహాయముతో  ఆ ప్రదేశంయొక్క  విశేషాలు వివరించాడు. అతను అనర్గళంగా ఇంగ్లీష్, జర్మన్ ,ఫ్రెంచ్ భాషలలో మాట్లాడుతున్నాడు. అన్ని ముఖ్యమైన ప్రదేశాలు కెనెల్స్ ఒడ్డునే ఉండటం వలన నగరమంతా మనం పడవ ప్రయాణంలో చూడవచ్చు. డచ్ వీరి అధికారిక భాష అయినా, ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మేము అన్నేఫ్రాంక్స్ హౌస్, ఆమ్స్టర్డామ్ మేయర్ అధికారిక నివాసం, verzetsmuseum ,బెగిజ్నహోఫ్, రాయల్ పాలస్ అఫ్ ఆమ్స్టర్డామ్ అను ప్రదేశాలని సందర్శించాము.

రాయల్ ప్యాలస్ 
మేము ఎంతగానో ఎదురుచూస్తున్న కేయూకెన్ హోఫ్ (keukenhof) టులిప్ పూల గార్డెన్ కి చేరుకున్నాము. ద్వారానికి ఇరువైపులా పూలు నవ్వుతూ, మాకు స్వాగతం పలుకుతున్నాట్లు ఉన్నాయి . ప్రపంచంలో ఉన్న పెద్ద పూల తోటల్లో ఇది ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది .ఈ గార్డెన్ మొత్తము 79 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇక్కడ ప్రతి సంవత్సరం 7 మిలియన్ పూల మొక్కలు పెంచుతారు. మార్చి నుండి మే వరకు సందర్శకులను అనుమతిస్తారు .ప్రతి సంవత్సరం  800,000 టూరిస్టులు ఈ గార్డెన్ ని సందర్శిస్తారు. ఇక్కడ మేము నెగిరిట, ప్రిన్సెస్ ఇరినే ,స్వీట్ హార్ట్, జుర్ల్ ఫ్లవర్స్ తో పాటు ఎన్నో రకాల పూలని చూసాము.ఎంతసేపు చూసిన తనివి తీరని అంత అందంగా ఉన్నాయి. అక్కడ మాకు చాల మంది తెలుగు వారు తారసపడ్డారు, మేము కొంతసేపు వారితో మాట కలిపి సరదాగా గడిపాము.గార్డెన్ దగ్గరిలో ఉన్న పూల తోటలకి  వెళ్లి అక్కడ ఫోటోలు తీసుకుని, కొంచెంసేపు సంతోషంగా గడిపి అక్కడి నుండి బయలుదేరాము. తరువాత  కిందేర్డిజిక్ (kinderdijk) అని పిలవబడే ప్రదేశానికి వెళ్ళాము. అక్కడ మాకు దాదాపు 20 వరకు గాలి మరలు(wind mills) కనిపించాయి. వాటిలో చాల వరకు ఇప్పటికి  పని చేస్తున్నాయి. ఈ  ప్రాంతము సముద్రమట్టముకన్న లోతుగా ఉండటం వలన ఆటు పోటూ సమయాలలో నీరు ఆ ప్రాంతాన్ని ముంచి వేయకుండా, ఆ ఊరి ప్రజలు ఈ మరలని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మరలు తిరుగుతూ వాటి దగ్గర్లో ఉన్న కాలువల నీటి మట్టాన్ని సమం చేస్తూ ఉంటాయి. ఈ గాలి మరల లోపల ఒక కుటుంబ ఉండటానికి సరిపోయేలా గదులు కూడా ఉన్నాయి. కొన్ని మరలు మ్యూజియంలా ఏర్పాటుచేసి, ఆ రోజుల్లోని మనుషులు జీవన విధానం తెలిపే వస్తువులు ఉంచారు.


అక్కడినుండి మేము  రోటర్ డామ్(rotterdam) సిటీకి వెళ్ళాము. ఈ సిటీ కూడా ఆమ్స్టర్డామ్ లా అందంగా ఉంది. ఆమ్స్టర్డామ్ లోని భవనాలు డచ్ సంప్రదాయ శైలిలో కనిపిస్తే, ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద అధునాతన  భవనాలు కనిపించాయి. నెథర్లాండ్స్ లో ఉన్న పోర్టులలో రోటర్ డామ్ పోర్ట్ ముఖ్యమైనది. మేము సముద్ర ప్రయాణం చేయదలిచి టిక్కెట్లు కొనుగోలు చేసాము.
రోటర్ డాం బీచ్ 
మాకు ఆ షిప్ లో సముద్ర వడ్డున కనిపించే ముఖ్య  ప్రదేశాల గురించి వివరించారు. రోటర్ డామ్ లోని ముఖ్య ప్రదేశాలు సముద్రం ఒడ్డునే ఉన్నవి. ఆ షిప్ పైన ఓపెనుగా ఉంది.


100 మంది కూర్చోటానికి వీలుగా కుర్చీలు వేసి ఉండటం వలన, మేము చల్లని సముద్ర గాలి మధ్య హాయిగా, అక్కడ నుండి కనిపిస్తున్న ప్రదేశాలను చూస్తూ సరదాగా గడిపాము. తరువాత క్యూబ్ హౌసెస్ అని పిలవబడే ప్రదేశానికి వెళ్ళాము. అక్కడ ఉన్న ఇల్లు అన్ని క్యూబ్ లా నిర్మించబడి చూడటానికి చాలా వింతగా మరియు తమాషాగా అనిపించాయి. కొన్ని ఇళ్లలో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి మరి కొన్ని ఇళ్ళు అమ్మకానికి ఉన్నవి.


ఒక ఇల్లుని సందర్శకులు కోసం కొంత రుసుము తీసుకుని అనుమతిస్తున్నారు. మేము కూడా ఆ ఇంటిని లోపలికి వెళ్ళాము. లోపల హాలు, వంటగది ,పడకగది ఉన్నాయి. కానీ మాకు అవి చాల ఇరుకుగా అనిపించాయి . ఇద్దరు మనుషులు  ఉండటానికి మాత్రం ఆ ఇల్లు  చక్కగా సరిపోతాయి. తరువాత దానికి దగ్గరలోనే ఉన్న పెద్ద ఇన్డోర్ లోకల్ మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ మాకు చాలా రకముల చేపలు, చీజులు ,పండ్లు మరియు వివిధ రకముల బ్రేడ్స్ కనిపించాయి.
మార్కెట్ 
అక్కడి నుండి కొంచెం దూరంలో ఉన్న మాడ్యురోడాం (madurodam) అనే ప్రదేశానికి వెళ్ళాము.

madurodam 
ఇది ఒక మినియేచర్ పార్క్, ఇక్కడ వివిధరకాల భవనాలు మరియు ప్రదేశాలని చిన్న చిన్నగా తాయారు చేసి పెట్టారు.  మనం చాల ఎత్తుగా  అక్కడ ఉన్న భవనాలు మనకన్నా చిన్నవిగా ఉండటం తమాషాగా అనిపించింది. ఇక్కడ ఇంకా మినీ షిప్ యార్డ్ ,ఎయిర్ పోర్టు ,చర్చిలు ,చారిత్రాత్మక ప్రదేశాలని ఏర్పాటుచేశారు. చివరిగా మేము ఆమ్స్టర్డామ్ లో ఉన్న రెడ్ లైట్  ఏరియాని సందర్శించదలచి అక్కడికి వెళ్ళాము. ఈ ప్రదేశము సిటీకి నడిబొడ్డున ఉంది. ఇక్కడ సందర్శకులకి ప్రవేశం ఉంది, కానీ అక్కడ ఫొటోలు తీయటం నిషిద్ధం. అక్కడ మేము చిన్న చిన్న గదులలో ఉంటున్న అమ్మాయలు మరియు వారి కోసం వచ్చే వారిని చూసాము. అక్కడ వ్యభిచారంకు చట్టబద్ధత ఉంది. ఆ అమ్మాయిల కోసం ప్రభుత్వం రాయితీలు కూడా కల్పిస్తుంది అంట. మనకి వారి జీవితం గురించి తెలుసుకోవాలి, మాట్లాడాలి అనిపిస్తే టూరిస్ట్ ఆఫీస్ లో టికెట్స్ కొనుగోలుచేస్తే వారు మనల్ని తీసుకువెళ్లి, వారి జీవన విధానం, ఏ పరిస్థితుల్లో వారు ఆ వృత్తి చేస్తున్నారు వంటి విషయాలు తెలియచేస్తారు. ఆమ్స్టర్డామ్ లో డైమండ్స్ ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి . మనకి కావాల్సిన సైజులో డైమండ్లని పొదిగి ఉంగరాలు తయారు చేసి ఇస్తారు. చివరగా మేము నెథర్లాండ్ చీజ్ ని రుచి చూసి సంతోషముగా వెనుతిరిగాము.


                     
                                               

No comments:

Post a Comment