Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Sunday, 16 October 2016

(Innsbruck,(Austria) travel info)

పచ్చని ప్రకృతి, చెక్క గృహములు మరియు మంచు శిఖరాల మధ్య ఉన్నటువంటి ఇన్స్బర్క్ నగర విశేషాలని మీకు ఈరోజు చెప్పదలిచాము. ఇన్స్బర్క్ నగరం ఆస్ట్రియా దేశములోని టైరోల్ రాష్ట్రమునకు రాజధాని. మేము జర్మనీలో ఉన్న స్టుట్గార్ట్ నగరము నుండి 4.30 గంటలు కారులో ప్రయాణము చేసి ఇన్స్బర్క్ కి చేరుకున్నాము.


 హోటల్లో బస కాకుండా ఫెరియెన్ ఒణున్గ్ అని పిలవబడే అద్దె గృహములను నెల ముందు బుక్ చేసుకున్నాము. ఈ గృహముల నిర్వహణ అంతా గృహ యజమానులు చూసుకుంటారు.. ఇన్స్బర్క్ కి పక్కన ఉన్న పల్లెటూరిలో మా వసతి గృహము ఉన్నది .ఆ ఇంటిని ఇద్దరు వృద్ధ దంపతులు చూసుకుంటున్నారు. వారు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచడమే కాకుండా అందంగా కూడా అలంకరించారు. ఆ గృహములలో వంట గది మరియు వంట పాత్రలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంటి భోజనం కావాలనుకునేవారు వంట చేసుకోవచ్చు. ఇంటి వెనుక పంట పొలములు, మరో వైపు మంచు కొండలు ఎటు చూసిన అందమైన ప్రకృతితో మా మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది. మా పడకగది కిటికీ నుండి మంచుకొండలు దగ్గరగా కనిపిస్తూ సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో  కన్నుల విందు చేసాయి.


చలికాలములో ఈ ప్రదేశము అంతా  మంచుతో కప్పబడి స్కీయింగ్(మంచు మీద జారే ఆట) కి అనువుగా ఉండటం వలన ఎక్కువ మంది ఆ సమయములో సందర్శిస్తారు. మేము ఇన్స్బర్క్ నగరంలో ప్రముఖ ప్రదేశాలని చూడదలచి కారులో బయలుదేరి మొదటగా టిరోల్ అనే ప్రదేశమునకు చేరుకున్నాం. అక్కడి నుండి కేబుల్ కారు సహాయముతో కొండ మీదకు చేరుకున్నాము. కొండ మీద 2 కిలోమీటరులు నడిచి కొండ చివరి వరకు చేరుకున్నాం. చుట్టూ కొండలు, మధ్యలో లోయ అద్భుతంగా అనిపించింది. కొండ మీద ఎక్కడ చూసిన గడ్డిచామంతి పూలు ఉండడం వలన పసుపు రంగు తివాచి పరిచినట్టుగా అనిపించింది.

టిరోల్ 
 కొండ మీద తేనటీగలు పెంచే పరిశ్రమలు ఉన్నాయి. పువ్వులు ఎక్కువగా ఉండటం వలన తేనేటీగలు మకరందాన్ని సేకరిస్తూ కొండ అంతా కనిపించాయి. అందువలన ఎవరు ఆ పువ్వుల మీద నడవటం కానీ ఆ తేనేటీగలని చంపటంగాని చేయకూడదు అని అక్కడ బోర్డు పెట్టారు. మేము ఆ కొండ మీద ఉన్న ఒక రెస్టారెంట్లో బ్రేడ్ ,చీజ్ తో   చేసిన టోస్ట్ మరియు  బంగాళ దుంపతో చేసే పొమ్మెస్ (ఫ్రైస్) తిన్నాము. తరువాత ఇన్స్బర్క్ సిటీలోని ఓల్డ్ టౌన్ లో వున్న డాచిల్  అని పిలవబడే ప్రదేశానికి వెళ్ళాము. అది మొత్తము రాగితో తాపడం చేయబడి చిన్నవసారలా ఉంది.. పండగ సమయాలలో  చేసే సంబరాలు అన్నీ ఇక్కడినుండే ప్రాంభమవుతాయట.
 గోల్డెన్స్ డాచిల్ 
తర్వాత బగ్గేర్సీ లేక్, హెర్జ్సీ లేక్ మరియు కుణ్డలే జార్జి అనే ప్రాంతాలను సందర్శించాము. హెర్జ్సీ లేక్ లో బోట్ రైడింగ్ అనుమతి ఉండటం వలన మేము ఒక పెద్దల బోట్ అద్దెకు తీసుకుని లేక్ అంతా బోటింగ్ చేస్తూ సరదాగా గడిపాము. అక్కడ చాల మంది ఉల్లాసంగా ఈత కొడుతూ ఆనందిస్తున్నారు ,చిన్న పిల్లలు కూడా ఏ మాత్రమూ భయపడకుండా ఈత కొట్టటం చూసి మాకు చాల ఆశ్చర్యము వేసింది.

హెర్జ్సీ లేక్ 

ఈ ప్రయాణంలో దారి పొడవునా మాకు చిన్న చిన్న పిల్ల కాలువలు కనువిందు చేసాయి .మహిళలకి ఎంతో ఇష్టమైన స్వరోస్కి నగలు పుట్టినది ఈ ఇన్స్బర్క్ నగరంలోనే, స్వరోస్కి రాళ్లు ప్రపంచము అంతా ప్రఖ్యాతిగాంచాయి. ఇక్కడ స్వరోస్కి మ్యూజియం ఉంది, అందులో రకరకాల క్రిస్టల్స్ తో చేసిన శిల్పాలు కనువిందుచేసాయే.

స్వరోస్కి మ్యూజియం 

 ఆ మ్యూజియంలో  ఉన్న దుకాణంలో మేముకూడా కొన్ని స్వరోస్కి రాళ్ళని మరియు నగలను కొనుగోలు చేసాము. ప్రకృతిలో సేద తీరాలి అనుకునే వాళ్ళకి ఈ నగరం ఎంతగానో ఆకట్టుకుంటుంది అనటంలో సందేహం లేదు. మేము కూడా చక్కటి అనుభూతలను మూట కట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యాము . 

No comments:

Post a Comment