కావాల్సినవి: నూనె- 2 టేబుల్ స్పూన్లు, ములక్కాయ ముక్కలు -15, మటన్ -1కేజీ, పెద్ద ఉల్లిపాయముద్ద -1కప్పు, టమోటో ముద్ద -1కప్పు, పచ్చిమిర్చి -4, లవంగాలు -5,యాలకులు -3, దాల్చిన చెక్క -1పెద్దముక్క, అల్లంవెల్లుల్లి పేస్ట్ -2 టేబుల్ స్పూన్లు, గరంమసాలా- 2 టీ స్పూన్లు, ధనియాల పొడి -1 టీస్పూను. మటన్ మసాలా -2టీ స్పూన్స్, జీలకర్ర -1 టీస్పూను, పసుపు- 1/2 టీస్పూను, ఉప్పు -తగినంత, కారం-2 టీస్పూన్లు, కొత్తిమీర- 2 కాడలు ,కరివేపాకు- 2 రెబ్బలు/ 10 ఆకులు ,పుదీనా -10 ఆకులు ,నిమ్మరసం -1 టీస్పూను, ఎండు కొబ్బరి పొడి -2 టీస్పూన్లు
తయారీ: ముందుగా మాంసాన్ని శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు ,పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, యాలకులు, లవంగాయాలు, దాల్చిన చెక్కను మటన్ ముక్కల్లో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం నూనె పొయ్యాలి, నూనె వేడి అయ్యాక ముందుగా సిద్దం చేసిపెట్టుకున్న మటన్ ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి. ముక్కలు లోని నీరు బయటికి రావటం మొదలయ్యాక మరో కప్పు నీరు ముక్కలు కొంచెం మునిగే వరకు పోసి మూతపెట్టి 3 కూతలు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
తర్వాత కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి, మిగిలిన నూనె పోయాలి, నూనె కాగాక జీలకర్ర మరియు కరివేపాకు వేసి అవి వేగాక పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ,ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి 3 నిమిషాలు వేయించాలి. తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పు చల్లి 5 నిమిషాలు పాటు ముక్క కొంచెం మెత్తబడే వరకు మూతపెట్టి మగ్గనివ్వాలి.
తర్వాత టమాటో పేస్ట్, గరంమసాలా, ధనియాలపొడి, కారం వేసి తక్కువ మంట మీద ఉంచి నూనె బయటికి వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. కుక్కరులో మటన్ ఉడికించగా మిగిలిన నీటిని కూడా కూరలో పోసేయాలి,
తర్వాత ఎండుకొబ్బరి పొడి మరియు మటన్ మసాలా కూడా వేసి మరో 15 నిమిషాలు కూర దగ్గరపడే వరకు ఉంచి దించేయాలి. చివరగ కొంచెం నిమ్మరసం వేసి కలయబెట్టి కొత్తిమీరతో అలంకిరించుకొవాలి.
No comments:
Post a Comment