బియ్యం - 1 కప్పు, నిమ్మకాయ - 1, పచ్చిమిర్చి - 2, ఉప్పు- తగినంత, పసుపు - 1/4 టీస్పూను, అల్లం - 1/4 అంగుళం, జీడిపప్పు- 10, పల్లీలు (సెనగకాయ పప్పులు) - 2 టేబుల్ స్పూన్లు, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తాలింపు కొరకు :
ఆవాలు - 1/4 టీస్పూను ,జీలకర్ర - 1/4 టీస్పూను ,ఇంగువ -చిటికెడు , పచ్చిసెనగపప్పు - 1/2 స్పూను , ఎండుమిర్చి- 2, మినపప్పు - 1/2 స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు.
తయారీ:
ముందుగా బియ్యాన్ని బాగా శుభ్రపరుచుకుని, కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి(కుక్కర్ / రైస్ కుక్కర్ లో ఉడికించుకున్న పర్వాలేదు). ఉడికిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ ఆరపెట్టుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారాక తాలింపుకు సిద్దంచేసుకోవాలి.
ఒక చిన్న కడాయిలో నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక ఇంగువ, తాలింపు సామాను, జీడిపప్పు, పల్లీలు,సన్నగా తరిగిన అల్లం మరియు పచ్చిమిర్చి(మధ్యకి నిలువుగా కోసుకోవాలి ) వేయ్యాలి. పప్పులన్నీ ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. వేగిన పప్పులలో పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆరబెట్టిన అన్నంలో ఈ పప్పుల తాలింపు, ఉప్పు మరియు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి . అంతే రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ.
నిమ్మకాయ రసం మరియు ఉప్పు కొద్ది కొద్దిగా మీ రుచికి తగినట్లుగా కలుపుకోవాలి. ఒక్కసారిగా ఉప్పు మరియు నిమ్మరసం వేసారనుకోండి, ఉప్పు లేక పులుపు పులిహోరలో ఎక్కువ అవ్వవచ్చు.
No comments:
Post a Comment