స్టూట్ట్గర్ట్ లో ఉన్నటువంటి పెర్షియన్ రెస్టారెంటు యొక్క వివరాలు ఈరోజు రివ్యూ లో తెలుసుకుందాం. పెర్షియన్ శైలి వంటలని ఇరానియన్ శైలి అనికూడా పిలుస్తారు.
ఈ రెస్టారెంట్ యొక్క విస్తీర్ణం చాలా తక్కువ కనుక తప్పనిసరిగా టేబుల్ ముందుగా బుక్ చేసుకోవలసి ఉంటుంది. మేము పెర్షిషెర్ టెల్లర్ (Persian teller) మరియు సాఫ్ర్న్ చికెన్ (Saffron chicken) అను వంటలని ఆర్డర్ చేసాము. అవి వొచ్చేలోగా తినేందుకు ముక్కలుగా కోసిన మందపాటి మైదా చపాతీ, పనీర్, ముల్లంగి ముక్కలు ,ఉల్లిపాయ ముక్కలు, పుదీనా మరియు కొత్తిమీరను ఇచ్చారు. చపాతీ ముక్కతో అవి నంజుకుని తినాలట.
అవి తినే లోగా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వొచ్చేసింది. పెర్షిషెర్ టెల్లర్ అంటే వారి శైలిలో తయారు చేసినటువంటి వంకాయ పెరుగు కూర, సలాడ్, మిరియాల పొడి చల్లిన పెరుగు మరియు సాఫ్ర్న్ రైస్ (Saffron rice) ఇచ్చారు. సాఫ్ర్న్ చికెన్ అనగా కుంకుమ పువ్వు మరి కొన్ని మసాలా దినుసులతో గ్రిల్ చేయబడ్డ చికెన్ వంటకం. దీనికి కూడా సలాడ్, పెరుగు మరియు సాఫ్ర్న్ రైస్ ఇచ్చారు. రుచి మన హైదరాబాద్ వంటలతో కొద్దిగా పోలి ఉంది. మన కబాబ్ మరియు కుంకుమ పువ్వు వేసి వండినటువంటి అన్నం లాగా అనిపించింది కాకపోతే మసాలాలు మరియు కారాలు కోచం తక్కువ. వంకాయ కూర మన పెరుగు వంకాయ కూరలాగా అనిపించింది. ఇరానియన్ బ్లాక్ టీ తో మా భోజనం ముగించాం. విభిన్న రుచులను ఆస్వాదించే వారు ఒకసారి ఈ రెస్టారెంట్ కి వెళ్ళవచ్చు.
మా రివ్యూ:
మా రివ్యూ:
- రేటింగ్ : 7.5/10.
- రికమెండ్ చేయదగిన ఐటమ్స్: బార్బెక్యూ ఐటమ్స్ మరియు టీ.
- ధర: 18-26 యూరోలు.
- బుకింగ్ : తప్పనిసరిగా టేబుల్ బుక్ చేసుకోవాలి.
No comments:
Post a Comment